సినిమా వార్తలు

బాహుబ‌లి నిర్మాత‌ల వ‌ద్ద దొరికిన బ్లాక్ మ‌నీ ఎంతో తెలుసా..!

look-here ts2apnews

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ రూ.500, 1000 నోట్లను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా నల్ల ధనాసురులు తమ సొమ్మును వైట్‌ చేసుకోవడం కోసం ర‌క‌ర‌కాల ప్లాన్లు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బెంగ‌ళూరులోనూ ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది. కొంతమంది వ్యక్తులు సుమారు రూ.100 కోట్లను.. తమ ఇళ్లు, కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి ఒక్కొక్కరికీ రూ.2.5 లక్షల చొప్పున ఇచ్చి, వారితో బ్యాంకు ఖాతాల్లో జమ చేయించి. మళ్లీ వారి నుంచి చెక్కులు పుచ్చుకుని ఆ మొత్తాన్నీ తెల్ల ధనంగా మార్చేశారు.

అయితే ఈ తంతు అంతా కేవ‌లం రెండు రోజుల్లోనే జ‌రిగింది. వీటిని ముందే ఊహించిన ఐటీ అధికారులు ఈ దొంగ లావాదేవీల వ్యవహారాన్ని ఇట్టే పసిగట్టేశారు. దీని వెన‌క ఎవ‌రు ఉన్నారా ? అని ఆరాతీస్తే ముంబైకు చెందిన అగర్వాల్‌ పేరు బయటకొచ్చింది. అతడు బాహుబలి కొనుగోలుదారు అని కూడా తేలింది.

ఓ వ్య‌క్తితో అత‌డికి ఫోన్ చేయించి బ్లాక్‌ను వైట్‌ చేస్తామని ఆశపెట్టి వలలోకి లాగారు. కొన్ని ప్రాంతాల్లో ‘బాహుబలి’ సినిమా హక్కులు కూడా తీసుకుంటామని అతడితో చెప్పించారు. ఆ ఎరకు చిక్కిన అగర్వాల్‌ తన వద్ద ఉన్న నల్లధనాన్ని వెల్లడించాడు.

అగ‌ర్వాల్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఐటీ అధికారులు హైదరాబాద్‌, ముంబై, బెంగళూరుల్లో ఏకకాలంలో 15 బృందాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ కార్యాలయాలు సహా హైదరాబాద్‌లో ఆరు చోట్ల, ముంబై, బెంగళూరుల్లో 9 చోట్ల సోదా చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రికి రూ.55 కోట్ల దాకా నగదు బయటపడినట్లు తేలింది.

బాహుబలి లావాదేవీల్లో చాలావరకు నగదులోనే జరగడంతో అదంతా బ్లాక్‌మనీగానే వారు భావిస్తున్నట్టు సమాచారం. కానీ.. అది వైట్‌ మనీయేనని.. తమ సినిమాకు సంబంధించి అన్ని చెల్లింపులూ పద్ధతి ప్రకారమే చేస్తున్నామని బాహుబలి బృందం ఐటీ అధికారుల ముందు వాదించినట్లు తెలిసింది. అయితే అందుకు ప‌క్కా ఆధారాలు చూపించుకోవాల్సిన అవ‌స‌రం బాహుబ‌లి నిర్మాత‌ల ముందు ఉంది.

Post Comment